Samagra Shiksha Abhiyan Talks With Officials Failed: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఐకాస నేతలు ప్రకటించారు. ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారితో ఉద్యోగ సంఘం నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏ సమస్యకూ స్పష్టమైన హామీ రాకపోవడంపై ఉద్యోగ సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులు కమిటీతో చర్చించిన మీదటే నిర్ణయం వెల్లడిస్తామంటూ అధికారులు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఆందోళన సందర్భంగా ఇప్పటి వరకు 670 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగ సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్‌ఎస్‌ఏ జాక్ తెలిపారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల తరపు ప్రతినిధులు ఎమ్మెల్సీ వై.వి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రితో త్వరలోనే చర్చలు ఏర్పాటు చేస్తామని అన్నారు. హెచ్ఆర్ పాలసీకు సంబంధించి హామీ వచ్చిందని, ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నారు. మంత్రి వద్ద మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమ్మెకాలంలో ఇచ్చిన నోటీసులకు సమాధానం సమ్మె విరమణ తరువాతే చెబుతామన్నారు. సమ్మె విరమణ అయ్యే వరకు ఎవ్వరూ విధులకు హాజరు కావద్దని సూచించారు. తమ సమస్యల పరిష్కారం చేస్తే తాము సమ్మెలోకి వెళ్లే వాళ్లం కాదని అన్నారు.
14వ రోజు ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
అంతకుముందు విజయవాడ పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రం నలుమూలల నుంచి సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం వద్దకు రావటంతో పోలీసులు ఉద్యోగులను నిర్బంధించారు. కొందరిని స్టేషన్లకు తరలించగా మరికొందరిని ఆటోనగర్‌లోని ఆటోమెబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాలుకు తరలించారు. గత నెల 20 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అణచివేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.
సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించేది లేదు: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు
న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్నామే తప్ప, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పాటు సీఎంకు, ప్రాజెక్టు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్ని అధికారులు చర్చలకు ఆహ్వానించారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమైనట్లు ఐకాస నేతలు తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌తో ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలమవడంతో, సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పట్టు వీడేది లేదని చెప్పారు.