పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆరోగ్య భత్యం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రాణాలకు తెగించి కరోనా విధుల్లో పాల్గొన్నా.. వారికి జీతాలు నిలిపేయడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఆపడం విడ్డూరమని విమర్శించారు.
కరోనా సమయంలో 20 శాతం మంది పారిశుద్ధ్య కార్మికులను అదనంగా విధుల్లోకి తీసుకుని.. ఇప్పుడు తొలగించడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విధుల్లో పాల్గొన్న మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ వర్క్ విభాగానికి చెందిన 9,700 మంది కార్మికులకు.. జీతాల్లో 10 శాతం కోత విధించారని మండిపడ్డారు. చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: