గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లుకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ బారిన పడి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఆమె మృతదేహాన్ని దహనం చేసేందుకు అంబులెన్స్‌లో గుంటూరు స్తంభాలగరువులోని శ్మశానవాటిక వద్దకు తీసుకువస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్వడంతో అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అంబులెన్స్ వెనక్కి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని తీసుకురాగా.. స్థానికులు మళ్లీ అడ్డుపడ్డారు. సీఐ కల్యాణరాజు నచ్చజెప్పినా అంగీకరించలేదు. దీంతో పోలీసులకు, స్థానికులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. అడ్డు తొలగకపోతే లాఠీఛార్జీ చేస్తామని సీఐ కల్యాణరాజు హెచ్చరించడంతో స్థానికులు వెనక్కి తగ్గారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మృతదేహాలను ఇక్కడకు తరలిస్తుండటంతో తాము ఎక్కడ కరోనా బారిన పడతామేమోనని భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు చెప్పారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు