కొవిడ్ కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలన్నీ మూతపడుతున్నాయి. నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో రోడ్లపై చిన్న తోపుడు బండి కూడా కనిపించడం లేదు. హోటళ్లు, పండ్ల దుకాణాలను మూసివేయడంతో ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చిన వారు ఆకలితో అలమటిస్తున్నారు. కొనుక్కుని తిందామన్నా ఏం దొరకడం లేదు. రోగులకు ఆస్పత్రి తరఫున ఆహారం అందజేస్తున్నా వారి బాగోగులు చూసుకునేందుకు వచ్చిన వారికి మాత్రం వెతలు తప్పడం లేదు. వీరి ఇబ్బందులు గమనించిన ఆసుపత్రి వర్గాలు రెడ్ క్రాస్ దృష్టికి తీసుకెళ్లగా.. వారికి భోజన వసతి కల్పించేందుకు ముందుకొచ్చింది. నిత్యం 300 మందికి ఆహారాన్ని అందజేస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. రోగుల సహాయకులకు వేడివేడిగా ఆహారాన్ని రెడ్‌క్రాస్ సభ్యులు అందజేస్తున్నారు.
ఆపద కాలంలో ఆహారం అందిస్తూ తమ ఆకలి తీర్చుతున్న రెడ్‌క్రాస్ సంస్థకు రోగుల సహాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ముగిసే వరకు ప్రతిరోజూ రోగుల సహాయకులకు ఆహారం అందజేస్తామని రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. వీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి దాతలు సహకారం అందిస్తున్నారు.
ఇదీచదవండి.