గుంటూరు జిల్లావ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరి చేరింది. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో మిరప, కంది పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో పంటలు పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెనాలి, చిలకలూరిపేట, మేడికొండూరు, పిరంగిపురం, తాడికొండలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో రాత్రి నుంచి మోస్తరుగా వర్షం పడింది. పెదపరిమి-తుళ్లూరు మధ్య కొట్టేళ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. కేవలం ట్రాక్టర్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి.
అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. నరసరావుపేట, భట్టిప్రోలులో తెల్లవారుజాము నుంచి గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పెదకూరపాడులో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి: పులిచింతలకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత