వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ...గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల ఎదుట బంధువులు ఆందోళన నిర్వహించారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...పిడుగురాళ్ల మండలం కామేపల్లికి చెందిన మణి కాన్పు కోసం గత శుక్రవారం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. శనివారం ఆమెకు సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో రక్తం కావాలని వైద్యులు మణి బంధువులకు సూచించారు. వారు రక్తదాతను వెతికే ప్రయత్నంలో ఉండగానే వైద్యులు ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున మణి పరిస్థితి విషమంగా తయారైందని..ఈ విషయాన్ని వైద్యులకు తెలిపినా పట్టించుకోలేదని వారు వాపోయారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని వారు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ..మృతురాలి బంధువులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారికి ఇరువైపులా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. అనంతరం వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి
రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్వో.. వైరల్ అవుతున్న వీడియో..