గుంటూరు హనుమయ్య నగర్లో ఉండే ఓ వృద్ధురాలు కొన్నిరోజుల క్రితం ఛాతీలో నొప్పిగా ఉందంటూ.. ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధరించారు. దీంతో ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 26న ఆమె మరణించింది. కొవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబసభ్యులెవరినీ అనుమతించకుండానే ఖననం చేశారు. చివరిచూపు దక్కనందుకు ఆ కుటుంబసభ్యులు విలవిల్లాడారు.
ఇదిలా ఉండగా.. నేడు ఆ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ఆమె కుమారుడికి ఫోన్ చేసి 'మా వల్ల పొరపాటు జరిగింది. మీ అమ్మగారికి కరోనా లేదు. రిపోర్టుల తారుమారుతో తప్పు జరిగింది' అని చెప్పారు. ఈ వార్తతో వృద్ధురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో అమ్మను ఆఖరిచూపు చూసుకోలేకపోయామని.. ఆమెకు తలకొరివి పెట్టలేకపోయానని కుమారుడు సాంబశివరావు వాపోయాడు. వారి నిర్లక్ష్యంతోనే తమ తల్లి మరణించిందని ఆరోపించాడు. దీనిపై జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోసారి ఎవరి విషయంలోనూ ఇలా జరగకుండా చూడాలని వేడుకున్నారు.
'మా అమ్మకు ఛాతీ నొప్పిగా ఉందని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించాం. వారు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. దీంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించాం. అక్కడ ఆమెకు ఛాతీకి సంబంధించిన వైద్యం చేయకుండా.. కొవిడ్‌కు చికిత్స అందించారు. తర్వాత చనిపోయిందని చెప్పారు. ఎవరూ లేకుండా అనాథ శవంలా ఖననం చేశారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఆ ప్రైవేటు ఆసుపత్రి వారు ఫోన్ చేసి మీ అమ్మకు నెగెటివ్ అని చెప్పారు. తప్పయిపోయిందని సారీ అంటున్నారు. మేం ఏం చేయాలి.. వారి నిర్లక్ష్యంతో అమ్మను కోల్పోయాం.. చివరిచూపునకు నోచుకోలేదు. మాకు న్యాయం కావాలి' -- సాంబశివరావు, వృద్ధురాలి కుమారుడు
ఇవీ చదవండి...
తెనాలిలో కరోనాతో వైద్యుడు మృతి.. వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి