మంత్రివర్గం సమావేశం దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమరావతి రైతులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఉండవల్లిలో తాడేపల్లి పోలీసులు ముగ్గురు రైతులను అరెస్టు చేశారు. సమావేశం అనంతరం వదిలి పెడతామని పోలీసులు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని ఐకాస డిమాండ్ చేసింది. మంత్రివర్గ సమావేశాల సందర్భంగా మందడంలోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం వరకు రైతులు, మహిళలు శిబిరం వద్దకు రావద్దని పోలీసుల ఆంక్షలు విధించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాకే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు.
సీఎం తాడేపల్లి నివాసం నుంచి మందడం శిబిరం ముందు నుంచి సచివాలయం వెళ్లనున్నారు. కాబినెట్ ముగిసి సీఎం తాడేపల్లి నివాసానికి వెళ్లాకే శిబిరం వద్దకు అనుమతి ఇస్తామని పోలీసులు రైతులకు చెప్పారు. రాజధాని అంశంపై నేడు సుప్రీంకోర్టు లో విచారణ ఉన్న నేపథ్యంలో ఏమి తీర్పు వస్తుందా అని రాజధాని గ్రామాల రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ