MLC Election Arrangements On CEO : రాష్ట్రంలో సోమవారం జరగబోయే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయ బద్దంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాలకు సీనియర్ ఐఏఏస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించామన్నారు.
సోమవారం రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు మూడు పట్టభద్రుల నియోజక వర్గ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గ స్థానాలకు మరియు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయన్నారు.
అనంతపూర్, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలకు వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా ఎంపికైన్లటు వెల్లడించారు. సోమవారం జరుగబోయే ఎన్నికల్లో 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది, 2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 10,00,519 పట్టభద్రులైన ఓటర్లు, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల్లో 55,842 మంది ఓటర్లు, స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో 3,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పట్టభద్రుల స్థానాల ఎన్నికకు 1,172 పోలింగ్ స్టేషన్లను, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికకు 351 పోలింగ్ స్టేషన్లను, 3 స్థానిక సంస్థల స్థానాల ఎన్నికలకు 15 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వీటిలో 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.., వీటి వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో బ్యాలెట్ ప్యాపర్ పై వైలెట్ కలర్ ఇంక్ పెన్ ద్వారానే సంఖ్యలను గుర్తిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలను కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియను లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
" సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తుంది.కౌంటింగ్ ఈ నెల 16 వ తేదీన, 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షెన్ బ్యాలెట్ పేపర్ ద్వారా అవుతుంది కాబట్టి టైం ఎంత పడుతుందో మనం చెప్పలేము. కొన్ని చోట్ల నంబర్ ఆఫ్ కాండెట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ మనం తెలంగాణా నుంచి 500 జంబో బ్యాలెట్ బాక్సెస్ తీసుకురావడం జరిగింది. " - ముకేశ్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఇవీ చదవండి