గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డోలాస్‌నగర్‌లో ప్రైమ్ గెలాక్సీ అపార్టుమెంట్‌లో విట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కత్తి అమోగ్ ఉంటున్నారు. ఆయన ఈ ఏడాది జూన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. తిరిగి అక్టోబరు 29న ఇంటికి చేరుకున్నారు. ఇంటిలో ఉంచిన 45 గ్రాముల బంగారు నగలు, చీరలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో తమ అపార్టుమెంట్‌లో గతంలో పనిచేసిన ఓ మహిళ తమ ఇంటిలో చోరీ అయిన చీరను ధరించి సెల్‌ఫోన్ వాట్సప్ స్టేటస్‌లో పెట్టగా ఈ విషయాన్ని అమోగ్ పోలీసులకు చేరవేశారు. విచారణ చేపట్టిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం చామర్తపూడికి చెందిన సామన సునీతను అదుపులో తీసుకున్నారు. ఆమె నుంచి 45 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.80 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితురాలు చోరీని అంగీకరించినట్లు సీఐ వివరించారు.