అమరావతి రైతుల్ని అరెస్టు చేసి... వారికి సంకెళ్లు వేసి తరలించటానికి నిరసనగా గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన రాజధాని, SC ఐకాస నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా... జైల్ భరో కార్యక్రమానికి బయలుదేరిన తెలుగుదేశం నేతల్నీ అడ్డుకున్నారు. రైతులకు బేడీలు వేసి ఓ తప్పు చేసిన ప్రభుత్వం... నిరసన తెలిపే హక్కు లేకుండా తమ నేతలను ఎక్కడికక్కడ బంధించి మరో తప్పు చేసిందని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్‌బాబు అన్నారు.
గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్లకుండా అమరావతి ఐకాస, రాజధాని ఐకాస నేతలను పోలీసులు ఉదయం నుంచే గృహనిర్బంధంలో ఉంచారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఐకాస నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయవాడ మొగల్రాజపురంలోని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేత శివారెడ్డికి నోటీసులు ఇచ్చిన మాచవరం పోలీసులు... ఇంట్లోంచి రాకుండా అడ్డుకున్నారు. విజయవాడలో తెలుగుదేశం నేతలు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమ, నెట్టెం రఘురాం తదితురలను... జైలు భరోకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం నేతలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, భీమవరంలో మాజీ MP తోట సీతారామలక్ష్మిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
ఎస్సీ రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం తమ నేతలను నిర్బంధించి మరో తప్పు చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. దీనికి ప్రభుత్వం భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.
రైతులు ఆందోళనలో పాల్గొనకుండా... రాజధాని ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు. మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా పెదపరిమితి-తాడికొండ అడ్డరోడ్డు వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాజధాని నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు వైపు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... వాహనాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వదిలిపెడుతున్నారు.
ఇదీ చదవండి