pictionary game: ఓ వ్యక్తి బోర్డు లేదా తెల్ల కాగితంపై చిత్రం గీస్తే ఎదుటి వ్యక్తి ఊహించి చెప్పే ఆటను టీవీ షోలలో చూస్తుంటాం..! దీన్ని ఆన్‌లైన్ తెరపై ట్రిపుల్‌ఐటీ ఆవిష్కరించింది. వర్సిటీకి చెందిన దృశ్య సమాచార సాంకేతికత కేంద్రం(సీవీఐటీ) ఆచార్యుడు ప్రొ.ఎస్.రవికిరణ్ నేతృత్వంలో విద్యార్థులు నిఖిల్ బన్సల్, కిరుతిక కణ్నన్, పి.శివాని బృందం పిక్షనరీ అనే ఆన్‌లైన్ గేమ్‌ను రూపొందించింది. ఈ తరహా ఆటలు లాక్‌డౌన్ సమయంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ ఆట పూర్తిగా ఆన్‌లైన్‌లో ఆడాలి. ఇందులో ఒకేసారి 70మంది పాల్గొనవచ్చు.
ఎలా ఆడతారు..? ఈ ఆటలో ఒకరు డ్రాయర్ (చిత్రం గీసే వ్యక్తి), మరో వ్యక్తి గెస్సర్(ఊహించే వ్యక్తి) ఉంటారు. మొదటి వ్యక్తి మనసులో ఒక పదాన్ని అనుకుని ఆన్‌లైన్‌లో పిక్షనరీ తెరపై నిర్దేశిత చిత్రం గీస్తాడు. దాన్ని అవతలి వ్యక్తి ఆ చిత్రమేంటో ఊహించి చెప్పాలి. నిర్దేశిత సమయంలో ఊహించి చెప్పలేకపోతే.. ఓడిపోయినట్లవుతుంది. ఈ గేమ్‌కు ఇప్పటికే 3,220 సెషన్స్ నిర్వహించగా.. 14 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 497 మంది పాల్గొన్నారు. ఇందులో మంచి ఫలితాలు రాబట్టారు.
నిబంధనలు మీరితే అప్రమత్తం.. చిత్రాలు గీసే సమయంలో అక్షరాలు, నంబర్లు రాసేందుకు వీల్లేదు. అలా చేస్తే వెంటనే కృత్రిమ మేధ సాయంతో నిబంధనలు ఉల్లంఘించినట్టు వస్తుంది. ప్రత్యేకంగా ఆ పదాలపై బాక్సు ఏర్పడి అప్రమత్తం చేస్తుంది. అలాగే కాన్వాస్ డ్యాష్ సాయంతో చిత్రంలో తర్వాత ఇవ్వాల్సిన స్ట్రోక్స్‌ను ముందే ఊహించి కంప్యూటర్ చెబుతుంది. పిక్షనరీ ఆటపై పేటెంట్‌కు దరఖాస్తు చేశామని మరిన్ని మార్పులతో మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రొ.రవికిరణ్ వివరించారు.
ఇవీ చదవండి: