PG Medical Student Health Bulletin: పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ వైద్యుల బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని నిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. విద్యార్థిని కొన్ని అవయవాలు సరిగా పనిచేయడం లేదు అని తెలిపారు.. ఆర్ఐసీయూలో ఆమెకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక బృందం విద్యార్థిని చికిత్సను గమనిస్తుందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు: రెండు రోజుల నుంచి వైద్య విద్యార్థిని ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని.. వైద్యులు, మంత్రులు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థినిలో ఎలాంటి కదలికలు లేవని, మెరుగైన వైద్యం పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆమె తండ్రి, బాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను వేధించి ఆస్పత్రి పాలు చేసిన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులు ఎంతటి వారైనా ప్రభుత్వం ఉపేక్షించదు: వైద్య విద్యార్థిని ఘటనలో నిందితులు ఎంతటి వారైనా ప్రభుత్వం ఉపేక్షించదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని, కమిటీ విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్న సత్యవతి రాథోడ్... నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతుందోని, వైద్యులు దగ్గరుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి వెల్లడించారు. వైద్యంతోపాటు భగవంతుడి ఆశీస్సులతో కోలుకుంటోందని వివరించిన సత్యవతి రాథోడ్... రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ పనితీరు వల్ల ప్రతి ఆడపిల్ల వెనుక ఒక నిఘా నేత్రం ఉంటుందన్నారు.
కారకులను కఠినంగా శిక్షించాలి : ఈ ఘటనపై తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఏబీవీపీ, బీఎస్పీ నేతలు, బజరంగ్‌దళ్ సహా కొన్ని గిరిజన సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థని ఆత్మహత్యయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితిలో కేఎంసీలో అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తగు చర్యలు తీసుకుని ప్రీతికి మెరుగైన చికిత్స అందించకపోతే కేఎంసీని ముట్టడిస్తామన్నారు.
సైఫ్ అరెస్ట్: వైద్య విద్యార్థినిని వేధించి.. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణమైన సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు.. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ బోనాల కిషన్ వెల్లడించారు. వైద్య విద్యార్థినిని వేధించినట్లు సైఫ్ మొబైల్‌లో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారని తెలిసింది.
ఇవీ చదవండి: