గుంటూరు జిల్లా తెనాలిలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. నేటి నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ఉదయాన్నే వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు తరలివచ్చారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాని పరిస్థితి ఉంది. ఉదయం 6గంటల నుంచి ప్రజలు పడిగాపులు కాస్తున్నా.. అధికారులు మాత్రం కానరావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్క ఎండ తీవ్రత, మరో పక్క కొవిడ్ ఆంక్షలతో 12 గంటల నుంచి కర్ఫ్యూ ఉన్న సమయంలో అధికారుల నిర్లక్ష్యం పనికిరాదని అంటున్నారు. నేటి నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని ప్రకటించిన అధికారులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ వేయడం కుదరదు అని చెబితే వచ్చే వాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీకా ప్రక్రియ వాయిదా..
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి కొవిడ్ టీకాలు ఇస్తామని ప్రకటించిన అధికారులు సమయానికి వ్యాక్సిన్ రాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి లో సోమవారం నుంచి వ్యాక్సిన్ వేస్తామని ఆదివారం ప్రకటించారు. వ్యాక్సిన్ కేంద్రాలలో టీకా వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సకాలంలో వ్యాక్సిన్ రాకపోవడంతో టీకా ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ రోగులను అనుమతించని తెలంగాణ