JANASENA PAWAN MANGALAGIRI TOUR : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈనెల 27న మంగళగిరిలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందించనున్నారు. ఈనెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేశారని పవన్ ఆరోపించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని అందించేందుకు పవన్ కల్యాణ్ ఈ నెల 27న రానున్నారు. అయితే ఈ పరిహారాన్ని పవనే స్వయంగా ఇప్పటం వెళ్లి అందించే అవకాశముందని.. వీలుకాని పక్షంలో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి అందించనున్నట్లు సమాచారం.
పవన్ పరిహారం ప్రకటించిన తర్వాత తమకు అవేమీ వద్దని వైసీపీకి చెందిన కొందరు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పరిహారం ఎందరికి ఇవ్వాలనే విషయంలో స్పష్టత రాలేదు. బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎవరైతే పరిహారం తీసుకునేందుకు అంగీకరిస్తారో వారికి ఇవ్వాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతమందికి అందించేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: