కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్( pawan kalyan fires on ycp govt news) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా అంటూ.. హెచ్చరించారు.
జనసేన గురించి మాట్లాడితే తోలుతీస్తామని చెప్పండి. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి చిట్టా కార్యకర్తలు రాసి పెట్టాలి. కాకినాడలో నాడు జనసేనపై చేసిన దాడిని మరిచిపోయే ప్రసక్తి లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైకాపా నేతలు గుర్తుంచుకోవాలి. బిహార్ నుంచి కిరాయి మూకలను కావాలంటే తెప్పించుకోండి. వైకాపా ఛానెల్‌లో జనసేన పేరు చెప్పడానికి ఇష్టపడరు. అదే ఛానెల్‌లో జనసేన పార్టీ పేరు చెప్పేలా చేస్తా - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
అమరావతిని కొనసాగించమని భాజపాకు చెప్పానని పవన్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం(special status to andhra pradesh news) గట్టిగా పోరాడామని.. ఈ విషయంలో అండగా ఉండాల్సిన వారే బంధాలు వేశారని వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోరాడదామంటే తనని గెలిపించలేదన్న పవన్.. విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడినని చెప్పుకొచ్చారు. తన ఆర్థికమూలాలు దెబ్బకొడతానంటే అభ్యంతరం లేదని.. తనకేం ఇడుపులపాయ ఎస్టేట్ లేదన్నారు. గత ఎన్నికల్లో ఓటమికి క్షమాపణ చెప్పారు పవన్
'వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి. ఊహించనివి జరగడమే ఎన్నికలంటే. 151 సీట్లు వచ్చిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 15 రావచ్చు. వైకాపా ఓడిపోయాక కౌరవ సభ పోయి పాండవ సభ వస్తుంది. ఓడిపోతానని నేనూ అనుకోలేదు. వైకాపా ఓడిపోతుందని వారు అనుకోకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది ' - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఏపీలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని పవన్ విమర్శించారు. తాను చాలా కాలం క్రితమే తుపాకీ వెనక్కి ఇచ్చేశానని తెలిపారు. ప్రాణంపై మమకారం లేదని చెప్పడానికే తుపాకీ ఇచ్చానని వెల్లడించారు. తనపై దాడులు చేస్తారని నాడు పోలీసులు హెచ్చరించారని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పెట్టినపుడు తమపై దాడులు చేయాలని చూశారని అన్నారు.
'ఒక్క కులమే శాసిస్తాను అంటే కుదరనే కుదరదు. అన్ని కులాలు సమానంగా ఉండాలి తప్ప ఒకే కులాధిక్యత తప్పు. కమ్మవారినే లక్ష్యంగా చేసి వైకాపా పనిచేస్తోంది. కమ్మవారిని సమాజం నుంచి తరిమేస్తామని చూస్తే జనసేన సహించదు. యుద్ధానికి రమ్మని వైకాపా మమ్మల్ని ఆహ్వానించింది. ఏపీ నుంచి వైకాపా ప్రభుత్వాన్ని పంపాల్సిన సమయం వచ్చింది. నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోమని సవాల్ చేస్తున్నా. భవిష్యత్తులో మా చేతిలో మీకు ఉందని గుర్తుంచుకోండి. యుద్ధం సైజ్ ఎలా ఉండాలి? ఎంత ఉండాలో వైకాపా నిర్ణయించాలి '- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి
PAWAN KALYAN: భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా: పవన్ కల్యాణ్