Medicines Shortage In Govt Hospitals: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నాం.. నాణ్యమైన వైద్యాన్ని అందించి.. ఉచిత మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలతో రోగులకు ఉపశమనం కలిగిస్తున్నాం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటీవల నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన ఈ ప్రకటన చేశారు. పేద రోగులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ఒక్క పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించి వారి మొహాల్లో చిరునవ్వులు విరబూయిస్తుందని సీఎం ఢంకా బజాయిస్తున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.
జిల్లా ఆసుపత్రుల్లో అత్యవసర మందులూ దొరకడంలేదు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులు, అందించే చికిత్స, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా.. వైద్య నిపుణులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందులు, సర్జికల్ వస్తువులను గుర్తించారు. ఈ మేరకు జిల్లా, బోధనాసుపత్రుల్లో 608 రకాల మందులు ఉండాలని నిర్ధారించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే కనీసం వందకు పైగా మందుల కొరత కనిపిస్తోంది. ఒక్క విజయనగరం బోధనాసుపత్రిలో మాత్రమే ఈ సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది. రేట్ కాంట్రాక్ట్‌లో కేవలం 492 రకాల మందులు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ కొన్ని సరఫరా కావడంలేదు. ప్రతి జిల్లా, బోధనాసుపత్రిలో 372 రకాల సర్జికల్ వస్తువులు, వ్యాధి నిర్థారణ కిట్లు ఉండాలి. కానీ రేట్ కాంట్రాక్ట్ కింద కేవలం 326 రకాలు మాత్రమే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి ల్యాబ్‌లో కిట్ల కొరత వల్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడంలేదు.
No Facilities in Hospital: పేరుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. అక్కడికి వెళ్లే రోగులకు..
రాష్ట్రంలో 2009 డ్రగ్ పాలసీ ప్రకారం మందుల కొనుగోలు జరుగుతోంది. 2017-18 నుంచి 2021-22 మధ్య.. గడిచిన ఐదేళ్లల్లో 2 వేల 41 కోట్లకు ఒక వెయ్యి 716 కోట్లు మాత్రమే.. మందులు, పరికరాల కొనుగోలుకు ఖర్చుపెట్టారు. బడ్జెట్ ఉన్నా.. ప్రణాళిక, సమన్వయ లోపాల కారణంగా 391.49 కోట్లు వినియోగించలేని దుస్థితి. ఇండెంట్లు పెడుతున్నా.. మందుల సరఫరా లేదని ఫార్మసిస్టులు చెబుతున్నారు. ఓ అధికారిక నివేదిక ప్రకారం.. 2016-22 మధ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏపీఎస్‌ఎంఐడీసీ 39 శాతం మందులు, 27 శాతం సర్జికల్ ఐటమ్స్, బోధనాసుపత్రులు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులకు 52 శాతం మందులు, 34 శాతం సర్జికల్ పరికరాల సరఫరా చేయలేదు. అత్యవసర మందులు 70 నుంచి 88 శాతం, అదనపు మందులు 65 నుంచి 88 శాతమే కొనుగోలు చేస్తున్నారు.
Power Cut in Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ కోతలు.. నరకం చూస్తున్న రోగులు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లింపులు సకాలంలో జరగకపోతుండడంతో టెండర్లలో పాల్గొనేందుకు మందుల తయారీ, పంపిణీ సంస్థలు ముందుకు రావడంలేదు. ఏపీఎస్‌ఎంఐడీసీకి మందులు, సర్జికల్ కిట్ల సరఫరా విషయంలో పంపిణీ సంస్థలు ఆలోచించుకోవాలంటూ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ (ఏఐఎంఈడీ) 2021లో ఏకంగా రెడ్ నోటీసు జారీ చేసింది. ఇది ఇప్పటికీ వెబ్‌సైట్‌లో ఉండడం ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
వైద్య నిపుణులు సిఫార్సు చేసిన ప్రకారమే ఆసుపత్రుల వారీగా మందులు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేటాయించిన బడ్జెట్‌కు అనుగుణంగా రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా మందుల కొనుగోలు జరగాలి. ప్రతి బోధనాసుపత్రి, జిల్లా ఆసుపత్రికి 608 రకాల మందులు సరఫరా చేయాలి. కానీ.. ఏపీఎస్‌ఎంఐడీసీ.. రేట్ కాంటాక్ట్‌లో 492 రకాల మందులు మాత్రమే ఉండడం విమర్శలకు దారితీస్తుంది. కనీసం రేట్ కాంటాక్ట్‌లో చూపిన మందులైన బోధనాసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయా అంటే.. అవీ కనపడని దుస్థితి నెలకొంది.
Dialysis Problems: ఆస్పత్రిలో కరెంట్ కష్టాలు.. కిడ్నీ రోగుల అవస్థలు