గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగి మూడు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను వైద్యులు పట్టించుకోవడం లేదని.. అందుకే భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు చెప్పాడు. గుంటూరు బంగరాలబీడుకి చెందిన శివ పెయింటింగ్ పని చేస్తుంటాడు. గత కొద్ది నెలల నుంచి నెమ్ముతో బాధపడుతున్నాడు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఓ టాబ్లెట్ ఇచ్చి పంపిస్తున్నారే తప్ప... ఆసుపత్రిలో చేర్చుకుని సరైన వైద్యం అందించట్లేదని బాధితుడు వాపోయాడు. తన తల్లిదండ్రులు చనిపోయారని... తన సోదరుడు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య, ఇద్దరు పిల్లలు తెనాలి గ్రామంలో ఉంటున్నారని తెలిపాడు. శివ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ తెలిపారు. శివ తన వ్యక్తిగత కారణాల వలన ఆత్మహత్యాయత్నం చేశాడని ఆయన అన్నారు. వైద్యులు అన్నివేళలలో అందుబాటులో ఉంటున్నారని.. వైద్యులు పట్టించుకోవడం లేదని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.
ఇదీ చూడండి. పాలకులు మారినా... గిరిజనుల రాతలు మారటం లేదు