చిలకలూరిపేటకు చెందిన చిరు వ్యాపారి రామారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పది, చిన్నమ్మాయి ఎనిమిదో తరగతికి వచ్చారు. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఆదాయం తగ్గింది. ఆన్‌లైన్ తరగతుల వల్ల ఖర్చు ఒక్కసారిగా పెరిగింది. భార్య మెడలోని ఆభరణాలను కుదువ పెట్టి నగదు తీసుకు వచ్చి ఆన్‌లైన్ తరగతులకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేశాడు. కొత్తగా అంతర్జాల కనెక్షన్ తీసుకున్నాడు.
బాపట్లకు చెందిన సుబ్బారావు మధ్య తరగతి ఉద్యోగి. పెద్దబ్బాయి ఇంటర్ రెండో సంవత్సరం, చిన్నబ్బాయి తొమ్మిదో తరగతిలోకి వచ్చారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జూమ్ యాప్ ద్వారా వీడియో తరగతులకు హాజరుకావాలని విద్యాసంస్థల నిర్వాహకులు చెప్పారు. సెల్‌ఫోన్లు ఉన్నా అందులోని డేటా మూడు గంటలు నిరాటంకంగా పాఠాలు వినడానికి సరిపోవడం లేదు. ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాకపోతే పిల్లలు చదువులో వెనుకబడతారన్న భయంతో అప్పు తెచ్చి రూ.40 వేలు ఖర్చు చేసి ల్యాప్‌టాప్, ట్యాబ్ కొనుగోలు చేశాడు. రూ.11 వేలు చెల్లించి ఏడాది మొత్తం అంతర్జాలం వచ్చేలా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాడు.
కరోనా వ్యాప్తితో ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ఆన్‌లైన్‌లోనే శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లకు అంతర్జాల కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. లాక్‌డౌన్‌లో కొంత సడలింపు ఇవ్వగానే ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ సంస్థల నుంచి కొత్త సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేశారు. సెల్‌ఫోన్ ద్వారా వచ్చే అంతర్జాల వేగం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, స్థానిక ప్రైవేటు సంస్థల నుంచి కొత్తగా బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 18 శాతం, జూన్‌లో 30 శాతం బ్రాడ్‌బ్యాండ్, వైఫై కనెక్షన్లు పెరిగినట్లు సెల్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. డేటా వినియోగం 43 శాతం పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వీరిద్దరే కాదు.. కరోనా కష్ట కాలంలో అదనపు భారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎందరో సతమతమవుతున్నారు. ఓవైపు బడులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు.. మరోవైపు తమ పిల్లలు చదువులో ఎక్కడ వెనకబడిపోతారోనని అప్పులు చేసి మరీ ల్యాప్‌ట్యాప్‌లు వంటివి కొనుగోలు చేస్తున్నారు.
ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఖర్చు
కరోనా లాక్‌డౌన్ కారణంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి, చెన్నై, పుణేలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పిల్లలను తీసుకొని స్వస్థలాలకు వచ్చారు. ఆయా నగరాల్లోని విద్యాసంస్థల్లో చదువుతున్న తమ పిల్లలు ప్రస్తుతం దూరంగా స్వగ్రామాలు, పట్టణాలకు రావడంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్‌లో తరగతులు చెప్పిస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సైతం ఆన్‌లైన్‌లో తరగతులకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు భారమైనా రుణాలు తీసుకుని పిల్లల కోసం ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రెండు ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక్కో కుటుంబం రూ.25 వేల నుంచి లక్ష వరకు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో ఈ వ్యయం భరించడం ఎక్కువ కుటుంబాలకు కష్టంగా మారింది. అయినా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కొనుగోళ్లు తప్పడం లేదు. రెండు వారాల్లో వీటి కొనుగోళ్లు 42 శాతం పెరిగినట్లు ఓ ఈ- కామర్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: