కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌పీటెల్ (నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్) సాంకేతికరంగ విద్యార్థులకు అవసరమైన అన్ని అంశాలను ఐఐటీ ఆచార్యులతో బోధించేందుకు ఏర్పాట్లు చేసింది. కొన్నేళ్ల క్రితమే ఇది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చినా ప్రస్తుతం కరోనా సమయంలో బహుళ ప్రయోజనకారిగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకునేది కేవలం 20శాతం మాత్రమే. ఆన్‌లైన్, గ్రంథాలయం, ప్రయోగపూర్వకంగా మిగిలిన 80శాతం నేర్చుకోవాలి. ఎన్‌పీటెల్‌లో విద్యార్థులకు అన్ని బ్రాంచిలకు సంబంధించిన అంశాలు, గేట్, పాత ప్రశ్నపత్రాలు వాటికి సమాధానాలు, తాజా పరిశోధనలకు సంబంధించిన విజ్ఞానం అందుబాటులో ఉంది.
స్వయం అనువర్తనం ద్వారా..
ఎన్‌పీటెల్ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు వినాలంటే స్వయం అనే అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అందులో విద్యార్థి చదువుతున్న కళాశాల, తరగతి తదితర వివరాలు నమోదు చేసుకుని నచ్చిన అంశానికి సంబంధించి పాఠాలు వినవచ్చు. సిలబస్‌లో లేని ఆధునిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు నేర్చుకోవచ్చు. అంతేకాకుండా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా పలు కోర్సులను అందిస్తున్నారు. ఎంచుకున్న అంశాన్ని బట్టి శిక్షణ ఇచ్చి, పూర్తయిన తర్వాత ధ్రువపత్రాలను జారీ చేస్తారు. వీటికి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది.
*విద్యార్థుల జీవితంలో కీలకదశ ఇంటర్మీడియట్. కొవిడ్ కారణంగా కళాశాలల ప్రారంభంపై ఇప్పటికీ స్పష్టతలేని పరిస్థితి. ఈ క్రమంలోనే పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి. జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు సంబంధించి సమయం సరిపోతుందా అన్న అందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది. దీనికి పలు సంస్థలు పరిష్కారం చూపుతున్నాయి. విద్యార్థులు కళాశాల ఆన్‌లైన్ పాఠాలతో పాటు డౌట్‌నెట్, టాపర్, వేదాంతు, బైజుస్ తదితర యాప్‌లను ఉపయోగిస్తూ పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఇంటర్మీడియట్ సాధారణ కళాశాలలో చేరి పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ ద్వారా సిద్ధమై మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులూ ఉన్నారు.
*నరసరావుపేటకు చెందిన జంగా విద్యాచరణ్‌రెడ్డి ఇంటర్మీడియట్ ఓ కార్పొరేట్ కళాశాలలో చేరాడు. అయితే అక్కడి వాతావరణం సరిపోక తిరిగి వచ్చాడు. అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న అవకాశాలను అన్వేషిస్తూ ఆన్‌లైన్ కోర్సులు ఉపయోగపడతాయని గుర్తించాడు. సాధారణ కళాశాలలో చేరి తన అధ్యయనం అంతా ఆన్‌లైన్‌లో ‘వేదాంతు’ అనే యాప్ ద్వారా చేసాడు. రెండేళ్ల పాటు పూర్తిగా వారి పర్యవేక్షణలోనే చదివాడు. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షకు హాజరయ్యాడు. ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ‘కీ’ ద్వారా తాను రాసిన సమాధానాలు సరిచూసుకుని 575 మార్కులు వస్తాయని ధీమాగా ఉన్నాడు. కళాశాల లేకపోయినా ఆన్‌లైన్‌లో మెరుగైన శిక్షణ పొందవచ్చని చెబుతున్నాడు.
వేయికిపైగా కోర్సుల మూక్స్
ఆన్‌లైన్‌లో మూక్స్ (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్) అనే మరొక వెబ్‌సైట్ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచి పీహెచ్‌డీ వరకూ విజ్ఞానశాస్త్రం, గణితం, సాంకేతిక విజ్ఞానం ఇలా అన్ని అంశాల్లో వెయ్యికిపైగా కోర్సులు ఉన్నాయి. చదువుతున్న కోర్సులతో పాటు ఆసక్తి ఉన్న ఎటువంటి అంశాన్ని అయినా నేర్చుకునేందుకు అవకాశం ఉంది. నాగార్జున యూనివర్సిటీ చాలా ఏళ్ల క్రితమే మూక్స్‌తో ఒప్పందం చేసుకుంది.
నేర్చుకునేందుకు అవకాశం
"కరోనా వల్ల ఆన్‌లైన్ తరగతులే నిర్వహిస్తున్నారు. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు మారుతున్న అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. కళాశాలలో బోధించే సిలబస్‌కు అదనపు పరిజ్ఞానం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఈ సమస్యను ఆన్‌లైన్ కోర్సుల ద్వారా అధిగమించవచ్చు. ఎన్‌పీటెల్, స్వయం అనువర్తనం ద్వారా చాలా అంశాలు నేర్చుకున్నాను"
- కె.శ్రీనాగజ్యోతి, బీటెక్ ద్వితీయ సంవత్సరం, నరసరావుపేట
ఇదీ చూడండి: 'గగన పోరాటాల్లోనే కాదు.. మానవతా సేవలోనూ భేష్'