కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 9వ తరగతి వరకూ అందరూ పాసయినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులంతా ఇళ్లలోనే ఉంటున్నారు. మరి ఏడాది పొడవునా చెప్పిన పాఠాల సంగతేంటి.. వాటిని మర్చిపోతే ఎలా... బడి లేదు కాబట్టి టీవీలు చూస్తూనో, ఆటపాటలతోనూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు గుంటూరులో ఓ విద్యాసంస్థ ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ ద్వారా పాఠాలు..
లాక్ డౌన్ వేళ ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చే వీలు లేదు. అలాంటి సమయంలో అందివచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుని పాఠాలు చెప్పేలా ఏర్పాట్లు చేసింది గుంటూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ. దీని కోసం టీచర్లకు వారి ఇళ్లకే బోర్డులు, ఇతర బోధనా ఉపకరణాలు అందజేశారు. ఓ మొబైల్ (జూం) యాప్ సాయంతో ఉపాధ్యాయులు, విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేశారు. సెక్షన్ల వారీగా విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేసి... అందులో టీచర్లను కలిపారు. ఉపాధ్యాయులు ఇంట్లో ఉండి... తమ స్మార్ట్ ఫోన్ ద్వారా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. పాఠం ముగియగానే విద్యార్థులు తమ సందేహాలు అడుగుతారు. వాటిని నివృత్తి చేయటంతో పాటు... ఇంటి వద్దే చేసేలా అసైన్మెంట్స్ ఇస్తారు. వాటిని తల్లిదండ్రుల సమక్షంలో పూర్తి చేసి ఉపాధ్యాయులకు వాట్సప్‌లో పంపించాల్సి ఉంటుంది.
ప్రతిరోజూ ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొకటి ఇలా 2 తరగతులు మాత్రమే ఉంటాయి. సెలవులు ఇచ్చిన సమయంలో పిల్లలు చదువులకు దూరం కాకుండా ఈ ఏర్పాటు బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ ఏడాది 9వ తరగతి వరకూ పరీక్షలు లేనప్పుడు పాఠాలు ఎందుకనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే పిల్లలు పూర్తిగా పుస్తకాలు పక్కన పడేయకుండా ఆన్ లైన్ తరగతుల విధానం కొంత వరకు ఉపయోగపడుతోంది. అలాగే పిల్లలు తమ ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో కనీసం ఆన్ లైన్లో అయినా కలిసే వీలు కలుగుతోంది.
ఇదీ చదవండి: