గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం తీర ప్రాంతంలో ఉన్న అడవులదీవి అనే మారుమూల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 1966 లో స్థాపించారు. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎన్నో సంవత్సరాలుగా పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేకుండా పోయాయి. ఈ సమస్యను గమనించిన పూర్వ విద్యార్థులు తమ వంతు సాయం అందించాలి అనుకున్నారు.
చదువుల తల్లి నిలయానికి తమ వంతుగా....
పాఠశాల స్వర్ణోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి చదువుల తల్లి నిలయానికి తమ వంతు చేయూతను అందించాలని తలచారు. మన గ్రామం మన బడి అన్న నినాదంతో పాఠశాలలో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు 20 లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు.
కార్పొరేట్ కళాశాలలకు దీటుగా...
పాఠశాలలో అదనపు తరగతి గదులు, కళావేదిక, విద్యార్థులు ఆటలు ఆడేందుకు మైదానంలో మెరకలు తొలగించడం, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, తీర ప్రాంతం కారణంగా... తాగేందుకు బోర్ల నుంచి ఉప్పునీరు వస్తుండటంతో శుద్ధ జల ప్లాంట్, మెరుగైన విద్యను అభ్యసించేలా డిజిటల్ తరగతి గది, ఆకతాయిలు లోనికి రాకుండా ఉండేలా పాఠశాల ప్రాంగణం చుట్టూ ముళ్ల కంచె వంటి ఎన్నో వసతులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చదువులో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు నగదు సాయం చేస్తున్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా.. పాఠశాల మంచి ఫలితాలు సాధిస్తున్న తీరుకు.. గ్రామస్తులు సైతం ఆర్ధికంగా తోడ్పాటు అందిస్తున్నారు.
ఇవీ చూడండి: