గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన దొండేటి మర్రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. సొంతూరిపై మమకారంతో బాగు చేయాలని సంకల్పించారు. అందుకు ఏదైనా పదవి ఉంటే బాగుంటుందని భావించారు. పంచాయతీ ఎన్నికలు రావటంతో తమ కుటుంబం తరపున ఎవరినైనా నిలబెడితే బాగుంటుందని ఆలోచించారు. మర్రెడ్డి తన ఆలోచనను గ్రామస్థుల ముందుంచారు. పంచాయతీ ఎన్నికల్లో తమను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవం చేస్తే.. గ్రామ అభివృద్ధికి.. అరకోటి నిధులు ఇస్తానన్నారు. అలాగే అర ఎకరం భూమిని గ్రామపంచాయతీకి విరాళంగా ఇస్తానని తెలిపారు. ఒకవేళ ఇతరులు ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా గ్రామాభివృద్ధికి తన వంతుగా 10లక్షలు రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఎన్నికల పేరిట అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు.
ప్రస్తుతం తాళ్లచెరువు గ్రామంలో దొండేటి మర్రెడ్డి ప్రతిపాదనే చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధికి అంతా కలిసి మర్రెడ్డి తల్లిని ఎన్నికల బరిలో నిలిపే విషయంపై చర్చిస్తున్నారు. అయితే గ్రామంలోని మరికొందరు ఇంకా ఎక్కువ ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎవరిని ఏకగ్రీవం చేసుకోవాలి.. లేకుంటే పోటీ పెట్టాలా అని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. గ్రామంలో అంతా చర్చించుకుని ఎవరిని నిలబెట్టాలనేది త్వరలో నిర్ణయించనున్నారు.
తాళ్లచెరువు పంచాయతీకి నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు అయింది. గ్రామస్థులు అంగీకరిస్తే తన తల్లి అన్నమ్మను బరిలో నిలపాలని మర్రెడ్డి భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఊరించినదొకరిని.. వరించినదొకరిని!