నామపత్రాల బలవంతపు ఉపసంహరణ, కొన్ని తిరస్కరణకు గురైన నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు చాలాచోట్ల ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాలో 65 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. విజయనగరం జిల్లాలోని 34 జడ్పీటీసీ స్థానాలకు 3 ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని 549 ఎంపీటీసీ స్థానాలకుగానూ 55 చోట్ల ఏకగ్రీవం కాగా... మిగతాచోట్ల ఎన్నికలు జరగనున్నాయి. విశాఖ జిల్లాలో ఒక జడ్పీటీసీ స్థానం ఏకగ్రీమవ్వగా... మిగతా 38 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 48 జడ్పీటీసీ స్థానాలకు రెండు చోట్ల అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కాగా... 863 ఎంపీటీసీ స్థానాల్లో 53 చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
గుంటూరు జిల్లాలో 8 జడ్పీటీసీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఎంపీటీసీల్లో వైకాపా 193 చోట్ల, తెలుగుదేశం ఐదు స్థానాల్లో, స్వతంత్రులు ఐదు చోట్ల ఏకగ్రీవమయ్యారు. ప్రకాశం జిల్లాలో 14 జడ్పీటీసీలను వైకాపా ఏకగ్రీవం చేసుకోగా... మిగతా 41 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలో 12 జడ్పీటీసీలను వైకాపా ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ప్రజలంతా జగన్ పక్షమే ఉన్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు.
కర్నూలు జిల్లాలో 14 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీమవగా... 39 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గత 4 రోజులుగా చిత్తూరు జిల్లా కేంద్రంగా వైకాపా శ్రేణులు రెచ్చిపోవటంతో... వారికి భయపడి అక్కడ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలో 29 జడ్పీటీసీలు వైకాపాకు ఏకగ్రీవం కాగా... మిగతా 36చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. చాలాచోట్ల తమ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం కావటంతో... వైకాపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.