No Own Coal Mine to AP: ఏపీ జెన్‌కో థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు కోసం.. మధ్యప్రదేశ్‌లోని సులియారి బొగ్గు గని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. ఒక సంస్థకు వేలం ద్వారా కేటాయించిన గనిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని.. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. సులియారి బొగ్గు గని కేటాయించాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం రాసిన లేఖకు ఈమేరకు సమాధానం పంపింది. అవసరమైతే వేలం ద్వారా బొగ్గు కొనుగోలు చేయాలని సూచించింది.
జెన్‌కో థర్మల్ ప్లాంట్లకు ప్రతి సంవత్సరం సుమారు 27 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఇందుకోసం ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్, తెలంగాణలోని సింగరేణి కాలరీస్పై ఆధారపడక తప్పడం లేదు. వేసవిలో బొగ్గు కొరత ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడుతోంది. అధిక ధరలకు బొగ్గు కొనాల్సి వస్తోంది. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి సొంతంగా నిర్వహించుకునేలా బొగ్గు గని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఆలోచనతోనే అదానీ కంపెనీ దక్కించుకున్న సులియారి బొగ్గు గని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
వేలంలో సులియారి బొగ్గు గనిని అదానీ సంస్థ దక్కించుకుంది. ఈ కేటాయింపు రద్దు చేసి, ఏపీకి ఆ గని ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దిల్లీ వెళ్లిన జెన్‌కో అధికారులు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. కానీ కేటాయించిన బొగ్గు గనిని రద్దు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. అవసరమైతే.. అదానీ సంస్థ అక్కడ ఉత్పత్తి చేసే బొగ్గులో 25 శాతాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తుందని.. దాన్ని వేలంలో కొనుగోలు చేయాలని రాష్ట్రానికి సూచించింది. టన్ను బొగ్గు బేసిక్ ధర 5వేల 600 రూపాయలుగా అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. ఇతర పన్నులతో కలిపి 8వేల 200 అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి రవాణా ఖర్చు కూడా కలిపితే గిట్టుబాటు కాదని.. టన్ను 4వేల 200కు ఇచ్చేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అధికారులు కోరారు. దీనికీ కేంద్రం అంగీకరించలేదు.
పొరుగున ఉన్న కర్ణాటక తన అవసరాల కోసం సొంత బొగ్గు గనిని ఏర్పాటు చేసుకుంది. సింగరేణి సంస్థకు తెలంగాణలోనే బొగ్గు గనులు ఉన్నా, థర్మల్ కేంద్రాల కోసం ఒడిశాలో మరో గని తీసుకుంది. ఇదే తీరులో ఏపీకి కూడా థర్మల్ కేంద్రాల కోసం బొగ్గు గని తీసుకోవాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకు ఒడిశాలోని అంగూల్ దగ్గర సర్పాల్-నౌపాల వద్ద గనిని కేంద్రం కేటాయించింది. అక్కడ మైనింగ్ చేయడానికి అనువైన పరిస్థితులు లేవు. ఉత్పాదక వ్యయం ఎక్కువగా ఉంటుందని, బొగ్గు కూడా ఆశించిన నాణ్యత లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో ఆ కేటాయింపును రద్దు చేసి, మరోచోట బొగ్గు గనిని కేటాయించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది.
ప్రస్తుతం సొంతంగా గని తీసుకుందామన్నా నాణ్యమైన బొగ్గు లభించే బ్లాక్‌లు ఎక్కడా లేవు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కొన్ని బ్లాక్‌లను కోల్ ఇండియా గుర్తించింది. వాటిని తీసుకోవాలని జెన్‌కో ప్రయత్నించింది. కానీ అక్కడి భూములకు ప్రజలు భారీగా పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు సుమారు కోటి రూపాయల వంతున చెల్లించాల్సి వస్తుందని ఒక అధికారి వెల్లడించారు. పునరావాసానికి భారీ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. ఇంత ఖర్చు చేసినా నాణ్యమైన బొగ్గు వచ్చే అవకాశం లేదు. అలాంటి బ్లాక్‌లను ఇప్పటికే వేలం ద్వారా పలు సంస్థలు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన వాటిని తీసుకున్నా నిర్వహణ భారంగా మారుతుందని జెన్‌కో అధికారులు చెబుతున్నారు.