సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల్లో సృజన వెలికి తీయడమే లక్ష్యంగా 'ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్' పేరిట గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీ.. కార్లు, బైక్ రేసుల పోటీలు నిర్వహించింది. వినూత్న సాంకేతికతను సమాజానికి అందించడమే లక్ష్యంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐఎస్ఐసీ ఇండియా, కేఎల్ వర్సిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో.. దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన 14 కళాశాల విద్యార్థులు పాల్గొని... తమ మేథస్సుతో సొంతంగా రూపొందించిన పలు రకాల బైక్‌లు, కార్లను ప్రదర్శించారు. వీటిని సాంకేతిక నిపుణులు అన్ని రకాల పరీక్షలు చేసి ఫిట్నెస్ ధ్రువపత్రం అందించిన తర్వాతే పోటీలకు అనుమతించారు.
ఆకట్టుకున్న ఆల్ టరైన్ వాహనాలు..
డిజైన్, వేగం, బ్యాటరీ సామర్థ్యం, సాంకేతిక వినియోగం తదితర అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్ రేసులో ముందంజలో నిలిచింది. అన్ని రకాల రహదారులపై దూసుకెళ్లేలా రూపొందించిన ఆల్ టరైన్ వాహనాలు... వాహన తయారీ సంస్థ ప్రతినిధులను ఆకర్షించాయి. విద్యార్థులకు తమ సంస్థల్లో ఐదంకెల వేతనాలతో ఉద్యోగ అవకాశాలనూ కల్పించారు. విద్యార్థుల మేథస్సు సమాజానికి ఉపయోగపడేలా చేయడమే పోటీల లక్ష్యమని కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది.
కాలుష్యం నానాటికీ పెరుగుతోన్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడమే లక్ష్యంగా వాహనాలు తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో... తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ బైక్‌లు, వాహనాలు తయారు చేస్తామని వారు తెలిపారు.
ఇవీ చదవండి: