జీఎస్టీ పరిహారం బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం ఆలస్యం కారణంగా.. రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆరు నెలల నుంచి కేంద్రం బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని.. ఇది రాష్ట్ర బడ్జెట్ కూర్పును ప్రభావితం చేస్తోందని ఈటీవీ భారత్కు చెప్పారు.
నిబంధన పాటించడం లేదు
వస్తు సేవల పన్ను పరిహారాన్ని రెండు నెలలకోసారి చెల్లించాలంటూ చట్టం స్పష్టం చేస్తున్నా.. కేంద్రం ఆ నిబంధన పాటించడం లేదని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. సెప్టెంబర్ - అక్టోబర్ బకాయిలనూ చెల్లించలేదన్నారు. ఒక్క అక్టోబర్ - నవంబర్ నెలల్లోనే రూ.682 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఇప్పటివరకు రూ.387 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. ఇంకా రూ.295 కోట్లు బకాయి ఉందని చెప్పారు.
రూపాయీ రాలేదు
డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించిన చెల్లింపుల్లో రూపాయి కూడా రాలేదని ఎంపీ లావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2017 జులై నుంచి కేంద్రం జీఎస్టీ పేరుతో ఎంత వసూలు చేసింది... ఎంత పరిహారం చెల్లించింది.. బకాయిలు ఎంత అన్న వివరాలు తెలపాలంటూ.. లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించానన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన సమాచారం ప్రకారం... ఈ లెక్కలు తేలాయని చెప్పారు. మరోసారి ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు.
ఇవీ చదవండి: