గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిలువూరు గ్రామంలోని కాట్రగడ్డ వెంకట సుబ్బయ్య, మాణిక్యమ్మ ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(NARA LOKESH TALKES WITH AIDED SCHOOL STUDENTS) ముచ్చటించారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ స్కూల్‌ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నామని.. చాలా మంది ఇప్పటికే అక్కడ మానేసి వేరే స్కూల్లో జాయిన్ అయ్యారని వివరించారు. ఎయిడెడ్ పాఠశాల్లో స్కూల్ ఫీజులు తక్కువగా ఉండేవని.. వాటికి ప్రభుత్వ గ్రాంట్లను నిలిపివేయడం వల్ల ఫీజులు కట్టలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. దీని వల్ల తాము నాణ్యమైన విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలు కొనసాగేలా చూడాలని నారా లోకేశ్‌ను కోరారు.
లోకేశ్ మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 19, 42, 50, 51 జీవోలను తీసుకొచ్చిందని అన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పేదలపాలిట వరం అన్న లోకేశ్.. ఈ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దివంగత నేత నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజి రెడ్డి కూడా ఎయిడెడ్ పాఠశాల్లో చదువుకున్నవారేనని లోకేశ్ గుర్తు చేశారు. ఆఖరికి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కూడా ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనే చదువుకున్నారని పేర్కొన్నారు.
శాసనసభ, మండలి బయట కూడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వాలు విద్య కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువేనన్నారు లోకేశ్. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ కోసం కేవలం ఏడాదికి రూ.560 కోట్ల ఖర్చు చేస్తే సరిపోతుందన్నారు. ఈ ఖర్చు కూడా భారమైందని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాల విషయంలో ఆప్షన్ల డ్రామాలు మానేసి, ఆ జీవోలను వెనక్కి తీసుకోవాలని లోకేశ్ సూచించారు.
ఇదీ చదవండి:
TDP MUSLIM LEADERS: 'సైదాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'