గుంటూరు జిల్లా పెనుమాక గ్రామం పెనుయేలు ప్రార్థనా మందిరం నిర్వాహకుడు, పాస్టర్ కిషోర్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఈమేరకు కిషోర్‌కు లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు. క్రీస్తు మార్గంలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే కిషోర్‌పై దాడి బాధాకరమన్నారు. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కిషోర్‌కి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటూ న్యాయ పోరాటానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. తనపై దాడి చేసింది అధికార పార్టీకి చెందిన వారు కాబట్టే న్యాయం జరగట్లేదని కిషోర్ లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సెక్షన్లు నమోదు చెయ్యకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.