తెదేపా హయాంలో పేదలకు ఇచ్చిన భూమినే దౌర్జన్యంగా తీసుకొని... తిరిగి వాటిని వారికే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. వైకాపా 9 నెలల పాలనలో 32 లక్షల మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాలను మోసపూరితంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా చైతన్యయాత్ర ద్వారా వైకాపా అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ప్రజల దృష్టి మళ్లించడం కోసం రోజుకో అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, వాసుపల్లి గణేశ్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆనందబాబు పేర్కొన్నారు. విశాఖలో పేదలకు చెందిన 10వేల ఎకరాలను వైకాపా నేతలు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైకాపా చేసేది బిల్డ్ ఏపీ కాదని... కిల్డ్ ఏపీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, కబ్జాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే సిట్ వేశారని విమర్శించారు.