Nadendla Manohar on Students Deaths in Govt Schools: వైసీపీ పాలనలో 62 వేల 740 మంది పాఠశాల విద్యార్థులు మరణించారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మనోహర్.. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన జీఈఆర్ (Gross Enrolment Ratio) సర్వే వివరాలను వెల్లడించారు.
Gross Enrolment Ratio Survey: సర్వేలో వెల్లడైన అంశాలు వైసీపీ ప్రభుత్వ అసమర్థతను తేటతెల్లం చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 62 వేల 740 మంది విద్యార్థులు మరణించారని సర్వేలో తెలిసిందని ఆరోపించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10 వేల 547 మంది పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత అనంతపురం, గుంటూరు జిల్లాల్లో విద్యార్థులు ఎక్కువ మంది చనిపోయినట్లు వివరించారు.
Rain Water in Classroom: జగన్ మామయ్యా.. చూశారా మా కష్టాలు..
Dropouts in Andhra Pradesh Govt Schools: పాఠశాల విద్యార్థులు చనిపోవటం ఊహించని పరిణామమన్న నాదెండ్ల.. ఇంత ప్రధానమైన అంశం ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదని ప్రశ్నించారు. 3.88 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారని, 2.29 లక్షల మంది విద్యార్థులు కనపడటం లేదని సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. అసలు ఈ సర్వే వివరాల్ని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు.
నాడు - నేడు, అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం, వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలకు పోతున్నారని.. మరి పాఠశాలల్లో ఆరోగ్య వ్యవస్థ ఎందుకు పాడైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఆవేదనను సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 151 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసేది ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం వైసీపీ కార్యక్రమాలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు - నేడుకు ఇంతగా ఖర్చు చేస్తున్నా పిల్లలెందుకు మరణిస్తున్నారని మనోహర్ నిలదీశారు.
"ఇది చాలా ప్రధానమైన అంశం.. ప్రతి ఒక్కరినీ కదిలించే అంశం. దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. అసలు 2 లక్షల 29 వేల మంది ఎలా తప్పిపోయారు. 3.88 లక్షల మంది విద్యార్థులు స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు. వేల సంఖ్యలో విద్యార్థులు మన పాఠశాలల్లో మరణించారంటే.. దీని కోసం మనమంతా కదిలి రావాలి. ఎంతో మంది తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వం బాధ్యత లేకుండా పరిపాలన చేస్తే ఇటువంటి అంశాలో వెలుగులోకి వస్తాయి. పాఠశాలల్లో ఎందుకు మెడికల్ క్యాంప్లు పెట్టలేదు. అసలు దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు స్పందించలేదు. దీని వెనుక అసలైన కారణాలు ఏంటి?" - నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్