గుంటూరు సర్వజనాస్పత్రిని జాయింట్ కలెక్టర్ ప్రశాంతి తనిఖీ చేశారు. అనంతరం వార్డుల్లో కలియ తిరిగి కొవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలోనే అవసరమైన సిబ్బందిని నియమిస్తామన్నారు.
కీలక సమయాల్లో బాధ్యతాయుతంగా..
ప్రస్తుతం 415 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. త్వరలోనే వాటిని 600 వరకు పెంచుతామన్నారు. కీలక సమయాల్లో వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విధుల రోస్టర్ను ప్రతిరోజూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
'కొరత లేకుండా చూడాలి'
కొవిడ్ రోగులకు అవసరమైన మందు రెమ్డెసివిర్ను అందుబాటులో ఉంచాలని.. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్లకు మార్కెట్లో డిమాండ్ దృష్ట్యా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్స్ ఎంతవరకు పని చేస్తున్నాయో నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎవరైతే టీకాలు తీసుకోలేదో వారికి స్పెషల్ డ్రైవ్ కింద టీకాలు వేయించాలని ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో డయాలసిస్ విషయంలో శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం జేసీ ప్రశాంతి కొవిడ్ వార్డులను పరిశీలించారు.
ఇవీ చూడండి : ఆస్పత్రి నుంచి 320 కొవాగ్జిన్ డోసులు చోరీ