గుంటూరు జిల్లా గుజ్జనగుండ్లకు చెందిన నడ్డి వంశీకృష్ణకు రౌడీ షీటర్‌గా పేరుంది. ఇతనిపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మూడు హత్య కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వంశీకృష్ణకు, కలుగూరి నాగరాజు అనే మరో రౌడీషీటర్ మధ్య పదేళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇందులో భాగంగా తనను హతమార్చాలని వంశీకృష్ణ పథకం వేస్తున్నాడని గ్రహించిన నాగరాజు.. వంశీకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడు.
రెండు గ్రూపులుగా ఏర్పడి...
ఈ క్రమంలో నాగరాజు బృందం రెండు గ్రూపులుగా ఏర్పడి, ఈనెల 2న వంశీకృష్ణను హత్య చేసేందుకు భాగ్యనగర్ ఒకటో లైన్లో మాటు వేశారు. సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, పట్టాభిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యాయత్నాన్ని భగ్నం చేశారు. హత్యకు ప్రయత్నించిన నాగరాజును, అతని బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు.
మారణాయుధాలు స్వాధీనం...
నిందితుల వద్ద నుంచి మూడు వేట కొడవళ్లు, నాలుగు కారం పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న వారిపైన రౌడీషీట్ తెరుస్తామని, వారికి బెయిల్ రాకుండా చూస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీచదవండి.