రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు తయారు చేసేందుకు అనుమతి పొందిన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్ళపాడులోని 'సేఫ్ పేరంటరల్స్' సంస్థను.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సందర్శించారు. ఇంజెక్షన్ల తయారీ విధానంతో పాటు ఇతర అంశాలపై సిబ్బందితో చర్చించారు. 5 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు తయారీకి రాష్ట్రంలోని సంస్థకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని మీడియా సమావేశంలో ఎంపీ తెలిపారు. ఆ మందు తయారీకి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని వెల్లడించారు.
కరోనా కష్ట కాలంలో రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లతో పాటు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల అవసరం విపరీతంగా పెరిగిందని ఎంపీ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 'సేఫ్ పేరంటరల్స్' కంపెనీలో ఇంజక్షన్ల తయారీకి కేంద్రాన్ని అనుమతి కోరగా.. వెంటనే స్పందించిందని తెలిపారు. మొదటగా పరీక్షలు తదితర అంశాలను పూర్తి చేసుకుని.. త్వరలోనే మందు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి:
పరిషత్ ఎన్నికలకు చేసిన ఖర్చును సీఎం ఇస్తారా?: చిల్లపల్లి శ్రీనివాస్