తుపానుపై అసెంబ్లీలో చర్చించకుండా చేశారని.. ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో కొల్లిమర్ల, కేబీపాలెం, చినలింగాయపాలెం, కాకుమాను ప్రాంతాలలో తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలాలను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ ఏడాది పంటలకు ప్రభుత్వం బీమా ఎందుకు చెల్లించలేదని... దీనిపై సమాధానం చెప్పాలని గల్లా డిమాండ్ చేశారు. బీమా చెల్లించకుండా ఇప్పుడు నష్ట పరిహారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. 70 శాతం మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడు సార్లు పంట నష్టం జరిగిందని, మొదటి విడత నష్ట పరిహారం చెల్లించారని...రెండో విడత పరిహారం ఇంకా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మరింత ఎక్కువగా పంటలకు నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గల్లా కోరారు. టిడ్కో ఇళ్లను వేరే వాళ్లకు ఇవ్వాలని చూస్తున్నారని.. అసలు లబ్ధిదారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: 350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు