ముస్లింల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోదని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామ సమీపంలో రూ.18 కోట్లతో జాతీయరహదారి పక్కనే ఉన్న 3.8 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ముస్లిం మైనారిటీ బాలికల కోసం రెసిడెన్షియల్ స్కూలును ప్రభుత్వం మంజూరు చేసింది. సంబంధిత భూమిని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ విభాగానికి అప్పగిస్తూ ప్రభుత్వం వారం రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యే రజిని రెవెన్యూ, ముస్లిం వెల్ఫేర్, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న స్కూల్ ద్వారా 540 మంది ముస్లిం మైనారిటీ బాలికలకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ముస్లింలకు శ్మశానవాటిక స్థల సమస్య ఉందని, ఎన్నికల సమయంలో ఈ సమస్య తీరుస్తానని తాను హామీ ఇచ్చానని చెప్పారు. ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సంబంధిత ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అతి త్వరలో శ్మశానవాటిక సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు, 25 మరణాలు