MLA QUOTA MLC ELECTIONS : రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్న ఎమ్మెల్యో కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎన్నికల ఓటింగ్... సాయంత్రం 4 గంటల వరకూ జరగనుంది. తెలుగుదేశం అభ్యర్థిని బరిలోకి దించి అధికార పార్టీ ఏకగ్రీవ ఆశలకు గండికొట్టడంతో.. పోలింగ్ ఉత్కంఠ రేపుతోంది. అధికార వైసీపీకి... సాంకేతికంగా 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉంది. కానీ ఏడుగురు అభ్యర్థులను పోటీకి నిలిపింది. ప్రతిపక్ష తెలుగుదేశానికి సాంకేతికంగా ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉన్నా... నైతిక మద్దతు లేని కారణంతో తొలుత తటపటాయించింది. కానీ బీసీ మహిళ పంచుమర్తి అనురాధతో అనూహ్యంగా నామినేషన్ వేయించింది. ఒక్కో అభ్యర్థి విజయం కోసం... 22 మొదటి ప్రాధాన్య ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా.. 22 మొదటి ప్రాధాన్య ఓట్లలోపే ఆగిపోతే... అప్పుడు రెండు ప్రాధాన్య ఓట్లు కీలకం కానున్నాయి. తెలుగుదేశం అభ్యర్థికి రెండో ప్రాధాన్య ఓట్లు పడే అవకాశం లేకపోవడం.. అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. కానీ అధికార పార్టీ నుంచి ఒక్కటైనా క్రాస్ ఓటింగ్ జరిగితే.. టీడీపీ వ్యూహం ఫలించనుంది.
2019 ఎన్నికల్లో.. సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్.. ఫ్యాన్ పంచెన చేరారు. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకు జైకొట్టారు. ఫలితంగా తమకు 156 మంది సభ్యుల బలం ఉందని, ఏడు స్థానాలూ తమవేనని.. వైసీపీ ధీమాగా ఉంది. కానీ.. తెలుగుదేశం ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునివ్వడం.. రసవత్తరంగా మారింది. కొన్నాళ్లుగా వైసీపీకు దూరంగా ఉంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అంతరాత్మ ప్రబోధానుసారమే ఓటేస్తామని బాహాటంగానే చెప్పారు.
ఇది.. అధికార వైసీపీలో అలజడి రేపింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకు ఓటు వేయకపోతే ఆ పార్టీ సంఖ్యా బలం 154కు తగ్గుతుంది. ఒక్కొక్కరికి 22 మంది చొప్పున ఆ 154 మంది కచ్చితంగా.. వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే సరిపోతుంది. కానీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే పరిస్థితేంటనే భయం.. వైసీపీని వెంటాడుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో.. కంగుతున్న వైసీపీ పెద్దలు అలా జరగకుండా.. జాగ్రత్త పడుతున్నారు.
3సార్లు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఐతే.. దానికి 132మందికి మించి హాజరు కాలేదు. అందులోనూ నలుగురు చెల్లని ఓట్లు వేయటం వంటి వైసీపీను అంతర్మథనంలో పడేసింది. 154 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది చొప్పున 7 బృందాలుగా విభజించి ప్రతీ బృందానికి ఇద్దరు-ముగ్గురు మంత్రుల పర్యవేక్షణ ఉండేలా.. జాగ్రత్త పడుతోంది. ఐతే రహస్య ఓటింగ్ కావడంతో.. తమ అభ్యర్థి గెలుపు ఖాయమని.. తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నిక పూర్తవగానే.. కౌటింగ్ జరగనుంది. 175 ఓట్లే కావడంతో ఈరాత్రిలోపే ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చదవండి: