MLA followers attack on Junnu Shahid Nagar residents: గుంటూరు తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లోని జున్నుషాహిద్ నగర్‌కు.. ఎమ్మెల్యే, ఎంపీ పర్యటనకు వెళ్లగా స్థానికులు తమ సమస్యల గురించి విన్నవించుకున్నారు. స్థానికంగా ఉన్న పీకలవాగు సమస్యతో బాగా ఇబ్బందులు పడుతున్నామని.. ఈ సమస్యపై అధికారులకు, ఎమ్మెల్యేకు ఎన్ని సార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే ముస్తఫా అనుచరులు.. అభ్యంతరం తెలిపి స్థానికులపై దాడికి యత్నించడంతో.. ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది.
కాలువలో పిల్లలు పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి ఎంపీ అయోధ్య రామిరెడ్డి డివిజన్ పర్యటనకు వెళ్లగా.. జున్ను షాహిద్ నగర్‌కు చెందిన కొంత మంది వర్షాలు వస్తే పీకలవాగులో పిల్లలు పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నా కాల్వలు నిర్మించటం లేదని ఎంపీకి వివరించారు. వర్షాలు వచ్చినప్పుడు. వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నీళ్లు ఇళ్లల్లోకి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మంజూరైన కాల్వలను రెడ్డి బజార్ల వైపు మళ్లించి నిర్మించారని.. నిత్యం పీకలవాగు నుంచి వచ్చే దుర్వాసనను తాము భరిస్తూ అసౌకర్యంగా ఉంటున్నామని వాపోయారు.
ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నారు.. నాయకుల అండతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు ఎవరూ ఇక్కడ ప్రశ్నించకూడదని ఆగ్రహించారు. మా ప్రాంతానికి ఎంపీ వచ్చినప్పుడు సమస్యలు చెబితే మీకేంటి అభ్యంతరం అంటూ జున్ను షాహిద్ నగర్ వాసులు ఎమ్మెల్యే అనుచరులతో వాదులాటకు దిగారు. పర్యటన ముగించుకుని ఎంపీ, ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్లిపోగానే మరోసారి ఎమ్మెల్యే అనుచరులు అక్కడకు చేరుకుని ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నారు.. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే పరిష్కరిస్తారు. ఎంపీ దృష్టికి తేవాల్సిన అవసరం ఏమిటి? మీరు ఎందుకు ఇలా వ్యవహరించారని.. ఇరువర్గాల వారు మరోసారి గొడవపడి నెట్టుకున్నారు.
దిగుతావా అంటూ గొడవ.. ఆ తర్వాత స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. స్థానిక వాసి బాజీ .. మురుగు కాల్వలో దిగి దాని లోతు ఎంత ఉందో ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చూపించారు. అతనితోనూ కాలువలోకి దిగుతావా అంటూ గొడవపె ట్టుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలను సమస్యలపై ప్రశ్నించకూడదని ఎమ్మెల్యే అనుచరులు తమపై గొడవకు దిగి కొట్టే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పర్యటనకు వస్తే సమస్యల గురించి కాక ఇంకేం చెబుతామని ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి యత్నించటం బాధా కరమని స్థానికుడు బాజీ వ్యాఖ్యానించారు.
బిఆర్ స్టేడియంపై ఎమ్మెల్యే ముస్తఫా అసంతృప్తి.. ఎమ్మెల్యే ముస్తఫా తన అసంతృప్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గంలోని బిఆర్ స్టేడియాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియం అద్భుతంగా ఉందని.. మరి తూర్పు నియోజకవర్గంలో ఉన్న బిఆర్ స్టేడియం అలా ఎందుకు లేదని ప్రశ్నించారు. స్టేడియం ప్రజలకు ఏం మాత్రం ఉపయోగపడటం లేదని వ్యాఖ్యానించారు. అందుకే బిఆర్ స్టేడియాన్ని కార్పోరేషన్ పరిధిలోకి తీసుకురావాలని.. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి స్టేడియం పరిశీలించారు. అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై ఎంపీ, ఎమ్మెల్యే చర్చించారు.