కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లెలో రెడ్‌క్రాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటింటికీ ఆరోగ్య సర్వే కార్యక్రమానికి సంబంధించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో వణుకుతున్నాయని మోపిదేవి అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కాపాడేందుకు వైద్య రంగం అహిర్నిశలు కృషి చేస్తోందని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా విధి నిర్వహణలో వైద్యులు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన విషయమని విచారం వ్యక్తం చేశారు.
లాక్డౌన్ కారణంగా రైతులకు నష్టం లేకుండా పంటను ప్రభుత్వమే కొనగోలు చేసి ఆదుకుంటుందన్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు కనీస దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే, వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: తెనాలిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం