గుంటూరు శివారు నాయుడుపేట వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్‌ను మంత్రి బొత్స పరిశీలించారు. జిందాల్ ఆధ్వర్యంలో చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. ప్లాంట్ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పురోగతి, గ్రిడ్ అనుసంధానం, నీటి సరఫరాపై చర్చించారు. అందులోని ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సంస్థ ప్రతినిధులు. అన్ని అంశాలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి బొత్స ఆదేశించారు.
జిందాల్ నిర్మిస్తున్న ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని బొత్స తెలిపారు. 2016లో ప్రారంభించినా ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైందన్నమంత్రి.. గుంటూరు, విజయవాడతో పాటు మరో 5 మున్సిపాలిటీల్లో చెత్తను ప్లాంట్‌కు తరలిస్తామన్నారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ద్వారా చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్లాంట్‌కు వెంగలాయపాలెం నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు భూగర్భ డ్రెయినేజీ పనులు కూడా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: