Viral Fevers in the State: జలుబు, దగ్గుతో కూడిన జ్వరాలు ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తున్న వేళ.. రాష్ట్ర వైద్యాధికారులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. తెలిపారు. తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లో సుమారు 750 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించారు.
జనవరిలో 12, ఫిబ్రవరిలో 9 హెచ్3ఎన్2 కేసులు మాత్రమే బయటపడ్డాయని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగానే వైరల్ జ్వరాలు వస్తున్నాయని వైద్యులు స్పష్టం చేశారు. తరగతి గదులు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరిస్తే మంచిదని సూచించారు. జ్వరం, దగ్గుతో బాధపడే విద్యార్థులు విద్యాసంస్థలకు రెండు, మూడు రోజులపాటు వెళ్లకుండా ఉంటే మంచిదని పేర్కొన్నారు.
వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే వైరల్ జ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. గత ఏడాది వరకు కొవిడ్ ప్రభావం ఉండడం, దాదాపు అవే లక్షణాలు ప్రస్తుతం కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన ఉందని అన్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం వైరల్ జ్వరాలు తగ్గాయన్న వైద్యులు.. మందులు వాడకపోయినా మూడు, నాలుగు వారాల్లో ఈ వైరల్ జ్వరాలు తగ్గిపోతాయన్నారు.
కొవిడ్ బాధితులు, దీర్ఘకాలిక రోగులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో మాత్రం జ్వరం, దగ్గు ఎక్కువ రోజులు ఉంటుందన్నారు. హెచ్‌ఐవీ రోగులు, మధుమేహం స్థాయి ఎక్కువగా ఉన్న వారు, అస్తమా, పొగతాగే వారు, మద్యం తీసుకునే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్3ఎన్2 రకం వైరస్ వల్ల వచ్చే జ్వరాలు.. విశ్రాంతి తీసుకుని, మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతాయని వైద్యులు తెలిపారు. వైరల్ జ్వరాలతో బాధపడే వారు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదన్న నిపుణులు.. దగ్గుతోపాటు వచ్చే కఫం ఆకుపచ్చ, పసుపు పచ్చగా ఉండి రక్తపు చార కనబడితే వైద్యులను వెంటనే సంప్రదించాలని సూచించారు.
"హెచ్3ఎన్2 అనేది ఇన్‌ఫ్లుయోంజా టైప్ ‘ఎ’ వైరస్ నుంచి వచ్చేది. ముక్కు నుంచి లంగ్స్ వరకూ దీని ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. మొదటి.. మూడు నుంచి అయిదు రోజుల వరకూ దగ్గు, ఒళ్లు నొప్పులు.. తరువాత జ్వరంతో మొదలవుతుంది. మూడు రోజుల నుంచి రెండు,మూడు వారాల పాటు పొడి దగ్గు ఉండిపోతుంది. కాబట్టి చాలా మంది.. ఇన్ని రోజులైనా తగ్గడం లేదు ఏంటని చూస్తున్నారు. కాకపోతే ఇది మూడు, నాలుగు వారాలలో తగ్గిపోతుంది". - డాక్టర్ వినోద్‌కుమార్, డీఎమ్‌ఈ
"కొవిడ్ వచ్చీ.. తగ్గిపోయిన వారికి కచ్చితంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లకి ఈ జ్వరం వచ్చే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ రోగులు, మధుమేహం స్థాయి ఎక్కువగా ఉన్న వారు, వివిధ దీర్ఘకాలిక రోగులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకి ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి". - డాక్టర్ సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల
ఇవీ చదవండి: