RTC Charges: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల మోత మోగుతున్నాయి. పెంచిన ఛార్జీలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలోనే బస్సు ఛార్జీలు మూడుసార్లు పెంచేసింది. మనతో పోల్చితే తెలంగాణ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆర్టీసీ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి.
ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. భారీగా పెరిగిన టికెట్ ధరలతో ప్రయాణికుల నడ్డి విరుగుతోంది. దూరప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. మూడున్నరేళ్లలోనే మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరగడంపై సామాన్యులు మండిపడుతున్నారు. డీజిల్ ధరలు పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ చెబుతున్నా.. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం మనకన్నా తక్కువ ధరలే ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సహా కేరళలో టికెట్ ధరలు.. మనకన్నా చాలా తక్కువ. పల్లె వెలుగు మొదలు.. ఏసీ సర్వీసుల వరకు అన్నింటా ఛార్జీల బాదుడే.
పల్లె వెలుగుల్లో కిలోమీటర్‌కు రూపాయి 2 పైసలు వసూలు చేస్తుండగా.. తమిళనాడులో మాత్రం ఇవే ఆర్డీనరీ బస్సులకు కిలోమీటర్‌కు 58 పైసలు మాత్రమే ఛార్జీ వసూలు చేస్తున్నారు. మన దగ్గర కనీస ఛార్జీ ఆర్డీనరీలో 10 రూపాయలు, ఎక్స్‌ప్రెస్‌లో 20, డీలక్స్‌లో 25, సూపర్ లగ్జరీలో 40 రూపాయలు ఉండగా.. కర్ణాటకలో ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ 5 రూపాయలు, ఎక్స్‌ప్రెస్‌ల్లో 10, అల్ట్రా డీలక్స్‌లో 20 తీసుకుంటున్నారు. తమిళనాడులో ఆర్డీనరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ 6 రూపాయల మాత్రమే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచగా.. తమిళనాడులో 2018నుంచి ఛార్జీలు పెంచలేదు. కర్ణాటకలో సైతం 2020 ఫిబ్రవరిలో ఛార్జీలు పెంచగా.. ఆ తర్వాత మళ్లీ పెంచలేదు.
ఏపీతోపాటు తెలంగాణలోనూ ఆర్టీసీ ఛార్జీలు పోటీపడుతున్నాయి. మనకన్నా తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు కొంత ఎక్కువే ఉన్నాయి.
ఇవీ చదవండి: