Margadarsi Chit Fund Offices searches: ఆరు దశాబ్దాల చరిత్ర గల మార్గదర్శి చిట్ ఫండ్స్.. నూటికి నూరు శాతం చట్టానికి లోబడి పనిచేస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర కానీ, ఖాతాదారుల ఫిర్యాదులు కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ పై లేవన్నారు.
మార్గదర్శి సంస్థ తమ చిట్స్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయానికి అందజేస్తూనే ఉంటుంది. చిట్స్ కు సంబంధించి సమస్త సమాచారం ఆ కార్యాలయంలోనే ఉంటుంది. అయినా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, జీఎస్టీ విభాగాలకు చెందిన డజన్ల కొద్దీ అధికారులు గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఖాతాదారుల సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నా కూడా.. అధికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ మార్గదర్శి చిట్ ఫండ్స్ సిబ్బంది సహకరిస్తున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులకు చట్టపరమైన ఉల్లంఘనలు ఏవీ కనిపించకపోవడంతో.. ఉన్నతాధికారులకు మౌఖికంగా అదే విషయాన్ని చెబుతూ వచ్చారు. అయినా ఏదో ఒక లోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారులు పదేపదే వారికి సరికొత్త ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు.
మూడు రోజులుగా దుర్భిణి వేసి వెతికినా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో వారు పసిగట్టిన లోపాలు శూన్యం. ఫలితం రాక నిస్పృహకు లోనైన అధికారులు చివరకు కల్పిత ఉల్లంఘనలు, లోపాలతో ఒక డాక్యుమెంట్ సృష్టించారు. కోర్టుల్లో మార్గదర్శికి వ్యతిరేకంగా ప్రయోగించే ఒక మెలిక కూడా అందులో పెట్టారు. ఆ డాక్యుమెంట్ పై సంతకాలు చేయాలని మార్గదర్శి మేనేజర్లను గురువారం రాత్రి వరకూ ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
సివిల్ అంశాన్ని క్రిమినల్ కేసుగా మలిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పూర్తిగా చట్ట పరిమితులకు లోబడి వ్యవహరించే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఇలా కుట్రపూరితంగా వ్యవహరించడం.. తమ సంస్థపైనా, అందులోని లక్షల మంది ఖాతాదారులపైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు అనుచితంగా వ్యవహరించారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని కార్యాలయంలో రాత్రి ఎనిమిదిన్నర వరకు, మధురవాడ కార్యాలయంలో రాత్రి తొమ్మిదిన్నర వరకు తనిఖీలు చేశారు. ప్రశ్నలు, జవాబులు వారే రాసేసిన ఏడెనిమిది పత్రాలపై సంతకం పెట్టమని డాబాగార్డెన్స్ మార్గదర్శి కార్యాలయం మేనేజర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన నిరాకరించడంతో.. వేరే బ్రాంచీల్లో మేనేజర్లు సంతకాలు చేశారని, మీరు కూడా చేయండని ఆయనపై ఒత్తిడి పెంచారు. ఆయన ససేమిరా అనడంతో.. ఆ విషయాన్నే రాసి సంతకం చేయమన్నారు. దానికీ ఆయన అంగీకరించకపోవడంతో.. రెండు రోజులు గడువు ఇస్తున్నామని... ఆలోచించుకోమని చెప్పి వెళ్లారు. వివిధ పత్రాలకు సంబంధించిన నకళ్లు వారి వెంట తీసుకుని వెళ్లారు.
మధురవాడ కార్యాలయానికి 10 మంది అధికారులు వచ్చారు. అక్కడ కూడా వారు సిద్ధం చేసిన పత్రాలపై సంతకం చేయమని మేనేజర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో.. సోమవారం నాటికి ఏ విషయం నిర్ణయించుకుని రావాలని హుకుం జారీ చేశారు. అప్పుడు కూడా సంతకం పెట్టకపోతే సెకండ్ వే లో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని కార్యాలయంలో పోలీసుల భద్రత మధ్య తనిఖీలు జరిగాయి. మార్కెట్ సెంటర్‌తో పాటు, అరండల్‌పేటలోని కార్యాలయంలో రాత్రి 8 వరకు తనిఖీలు కొనసాగాయి. తాము సిద్ధం చేసిన పత్రాలపై సంతకాలు పెట్టాలని మేనేజర్‌పై అధికారులు ఒత్తిడి తెచ్చారు. దానికి వారు అంగీకరించలేదు.
కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సీఐ రాఘవన్ ఎక్కువ హడావుడి చేశారు. తాము సిద్ధం చేసిన పత్రాలపై సంతకం పెట్టాలని మార్గదర్శి మేనేజర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయనతో తమ సంభాషణను వీడియో రికార్డింగ్ చేశారు. కార్యాలయం లోపల ఉన్నవారందరినీ ఆయన వీడియో తీశారు. తిరుపతి, విజయవాడ లబ్బీపేట కార్యాలయాల్లో సోదాలు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి.
ఇవీ చదవండి: