"బీసీలకు కేటాయించిన నిధులు...పక్కదారి పట్టిస్తున్నారు" - lokesh commments on government
బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించి రూపాయి ఇవ్వకుండా అమ్మ ఒడి అంటూ సీఎం జగన్ భారీ బొమ్మ చూపించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. బీసీలకు చెందాల్సిన 3వేల 432 కోట్లు మాయం చేశారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆ వర్గానికి వెళ్లాల్సిన 568 కోట్లు పక్కదారి పట్టించారని..., ఎస్సీల అభ్యున్నతికి వినియోగించాల్సిన ఒక వెయ్యి 271 కోట్లను గాల్లో కలిపేశారని దుయ్యబట్టారు. మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించాల్సిన 442 కోట్లను అటకెక్కించారని ధ్వజమెత్తారు. గిరిపుత్రులకు చెందాల్సిన 395 కోట్ల రూపాయలను గంగలో కలిపేశారని విమర్శించారు. నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా దళిత ప్రభుత్వ ఉద్యోగులపై వైకాపా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలు అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దళిత అధికారులపై వైకాపా నేతలు దాడులకు దిగటం దారుణమని మండిపడ్డారు. ములకల చెరువు ఎంపీడిఓ రమేష్‌పై వైకాపా నేతల దాడిన హేయమైన చర్యని విమర్శించారు. గ్రామాల్లో వైకాపా నాయకల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తప్పుడు పనులకు సహకరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని దుయ్యబట్టారు. సహకరించని అధికారులపై వైకాపా నేతలు దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రాష్ట్రంలో అధికారులకే రక్షణ లేనప్పుడు ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.