Laksh Chandi Mahayagna : హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర సమీపంలో షహబాద్ వేదికగా శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. చండీమాతను ప్రార్ధిస్తూ దేశ సంక్షేమం కోసం ఈ యజ్ఞాన్ని చేపట్టారు. గుంతి ఆశ్రమం నిర్వహణలో.. ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అతి సనాతనమైన ఈ కృతువును శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శివరాత్రి రోజున రుద్రాభిషేకం నిర్వహించారు. శారదా స్వరూప రాజశ్యామల, చంద్ర మౌళీశ్వరుల పీఠార్చన నిర్వహించారు. ఏకకాలంలో రుద్రం చదివారు.
ఆరు వేల 976 చండీ పారాయణ హోమాలను నిర్వహించారు. పది వేల సార్లు శివ పంచాక్షరీ హోమాలను పూర్తి చేశారు. ఆదివారం మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్‌లో లక్ష చండీ మహాయజ్ఞం జరపడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఈ మహా క్రతువు.. అప్పటి నుంచి పదహారు రోజులపాటు నిర్వహించారు. అష్టోత్తర శత కుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా.. ఈ యజ్ఞానికి నామకరణం చేశారు.
ఏకకాలంలో 1760 మంది రుత్విక్కులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. వీరికి సహాయంగా మరో నాలుగురు మొత్తం 2వేల 160 మంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. అధికంగా పండితులు మాత్రం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రుత్విక్కులు ఉన్నారు. అశేషంగా భక్తులు ప్రతిరోజు ఈ యాగాన్ని సందర్శించారు. ఇక్కడికి వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా.. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఐదేకరాల ప్రాగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో.. ప్రతిరోజు సాయంత్రం మహాహారతితో పాటు సాంస్కృతిక ఆరాధనలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతితో ఈ మహాక్రతువు పూర్తికానుంది.
ఇవీ చదవండి :