కొవిడ్ వైరస్ ఉత్పరివర్తనాల గుర్తింపునకు గుంటూరు వైద్య కళాశాలలో కొత్తగా ప్రయోగశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం సుమారు రూ.4 కోట్లు వ్యయం చేయనున్నారు. వైరస్ జన్యుక్రమాల ఆవిష్కరణతో పాటు వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు ఈ ప్రయోగశాలలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టనున్నారు. దీని ద్వారా వైరస్‌లో కొత్త రకాలను గుర్తించడం సులభమవుతుంది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్‌లోని మిగతా రకాలతో పోలిస్తే డెల్టా ప్లస్ వేరియంట్ ఊపిరితిత్తుల కణజాలంతో ఎక్కువగా పెనవేసుకుపోతోందని వైద్యులు చెబుతున్నారు.
ప్రయోగశాలలో పరీక్షల అనంతరం బాధితుల్లో ఇది తీవ్ర వ్యాధిని కలిగిస్తుందా? ఎక్కువ సంక్రమణ శక్తి కలిగి ఉంటుందా అనే విషయాలపై ఒక అంచనాకు రావడానికి వీలవుతుందని నిపుణులు తెలిపారు. కొవిడ్ మూడో ఉద్ధృతి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇందుకు అవసరమైన పరికరాలు సరఫరా చేయడంతో పాటు అమర్చేందుకు రాష్ట్ర ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ నెల 3న టెండర్లు పిలిచారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ల నుంచి ర్యాండమ్ విధానంలో నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ ఉత్పరివర్తనాన్ని గుర్తిస్తున్నారు. అక్కడి నుంచి ఫలితాలు రావడంలో ఆలస్యం అవుతోంది. గుంటూరులో ప్రయోగశాల ప్రారంభమైతే ఇక్కడే ఆ పరీక్షలు నిర్వహించేందుకు వీలవుతుందని, దీనివల్ల ఫలితాలు సత్వరమే వెలువడతాయని వైద్యులు చెప్పారు.
ఇదీ చూడండి: అక్కడ ధరలు పెరిగితే.. ఇక్కడున్న అన్నదాతపై అదనపు భారం!