హైదరాబాద్‌లోని జలసౌధలో కష్ణా, గోదావరి నదీ యాజమాన్యబోర్డుల ఉమ్మడి సమావేశం వాడీవేడిగా జరిగింది. బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన ఉమ్మడి సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జలవిద్యత్ అంశంపై మరోమారు చర్చ జరిగింది. విద్యుత్ అంశాన్ని పూర్తి చేద్దామని ఏపీ అధికారి శ్యామలరావు ప్రతిపాదించగా.. తమ అభిప్రాయం ఇప్పటికే స్పష్టం చేశామని తెలంగాణ అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మళ్లీ చర్చ అంటే మరోమారు సమావేశానికి రానని స్పష్టం చేశారు. సమావేశంలో రజత్ కుమార్ నిలబడే వాదనలు వినిపించారు. అంతకుముందు కేఆర్ఎంబీ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ అధికారులు.. ఛైర్మన్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు.
'చెరి సగం వాటాను అంగీకరించలేదు. ట్రైబ్యునల్ ఒప్పందం ప్రకారమే వెళ్లాలని కోరాం. 70 శాతం వాటా కావాలని కోరాం. గత నిష్పత్తి 66:34నే కొనసాగించాలని నిర్ణయించాం. ప్రాజెక్టులు నిండి దిగువన అవసరముంటే విద్యుదుత్పత్తి చేయాలి. తెలంగాణ నిబంధనల ఉల్లంఘనతో వంద టీఎంసీలు వృథా అవుతున్నాయి. తెలంగాణ వాదనను కేఆర్ఎంబీ అంగీకరించలేదు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేయరాదని బోర్డు నిర్ణయించింది. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించాం. అవసరమైన వివరాలు, సమాచారం ఇస్తామని చెప్పాం. గెజిట్ అమలుతో 2రాష్ట్రాల జలవివాదాలు పరిష్కారమవుతాయి. క్యారీ ఓవర్ జలాలు రెండు రాష్ట్రాలకు చెందుతాయి. క్యారీ ఓవర్‌పై తెలంగాణ ప్రతిపాదనను బోర్డు అంగీకరించలేదు' - శ్యామలరావు, ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాం: రజత్ కుమార్
సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణా జలాల్లో 50శాతం వాటా కావాలని కోరాం. వాటాలు ఖరారు చేసే అధికారం లేదని కృష్ణా బోర్డు తెలిపింది. 299, 512 టీఎంసీల చొప్పున నీటి వాటాలు కొనసాగుతాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా చూడాలని కోరాం. గెజిట్ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి ట్రైబ్యునల్ అనుమతులు ఉన్నాయి. వివరాలపై బోర్డు సానుకూలంగా స్పందించలేదు. రెండు బోర్డులు పాత వాటినే కొనసాగించేందుకే మొగ్గు చూపాయి. విద్యుత్ విషయంలో బోర్డు వైఖరికి నిరసనగా వాకౌట్ చేశాం. కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, కంతనపల్లి డీపీఆర్‌లు ఇచ్చాం. 10 ప్రాజెక్టులు అవసరం లేదన్నాం. దేవాదుల, మొడికుంటవాగు, చనాఖా-కొరటా ప్రాజెక్టుల డీపీఆర్‌లు తయారవుతున్నాయి. టెలిమెట్రీ విషయంలో కేఆర్‌ఎంబీ విఫలం. బోర్డులు ఇతర సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో చెప్పాలి. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు పూర్తి స్థాయి కార్యాచరణ అవసరం. మిషన్ కాకతీయలో సామర్థ్యం ఎక్కడా పెంచలేదు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడుకు కేటాయింపులపై నిరసన తెలిపాం. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పాం. గోదావరి జలాలకు బదులుగా కృష్ణా జలాలు తీసుకుంటాం. 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తీసుకుంటామన్నాం’’ అని రజత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
ఇదీ చదవండి