తన భర్త కనిపించడం లేదంటూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రామిశెట్టి శ్రీలక్ష్మి అనే మహిళ నరసరావుపేట సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఘటన మరో మలుపు తిరిగింది. తనను ఎవరూ అపహరించలేదని.... క్షేమంగా ఉన్నానంటూ ఆమె భర్త రామిశెట్టి శ్రీనివాసరావు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భార్య కావాలనే అధికారులకు తప్పుడు సమాచారమిచ్చిందని అతను ఆరోపించారు. మీడియాలో వచ్చిన వార్తను చూసి ఈ సెల్ఫీ వీడియో విడుదల చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఇదీ జరిగింది...
తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని చిలకలూరిపేటకు చెందిన రామిశెట్టి శ్రీలక్ష్మి అనే మహిళ కుమారుడితో కలిసి వచ్చి బుధవారం నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్‌నుపూర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ తన భర్త శ్రీనివాసరావు మరికొందరితో కలిసి హైదరాబాద్‌లో కంపెనీ పెట్టారని అందులో నష్టాలు రావటం, రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడ నుంచి దాదాపు ఏడాది క్రితం చిలకలూరిపేటకు వచ్చామన్నారు. ఈ నేపథ్యంలోనే మా మరిది రామిశెట్టి కోటేశ్వరరావుకు ఇవ్వాల్సిన అప్పు చెల్లించాలని అతను అడగ్గా కొంత సమయం ఇవ్వాలని కోరగా... అతను చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని వ్యక్తిగత సహాయకుడు నాగిశెట్టి ఫణీంద్రను ఆశ్రయించారన్నారు. ఫణీంద్ర మరికొందరు కలిసి ఇంటికి వచ్చి తన భర్తను ఆరు నెలల క్రితం తీసుకెళ్లారన్నారు. తన భర్త కనిపించకపోవటంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. జిల్లా ఎస్పీ, నరసరావుపేట డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సబ్ కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరగా విచారించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. దీనిపై స్పందించిన ఆమె భర్త రామిశెట్టి శ్రీనివాసరావు... తాను క్షేమంగా ఉన్నానంటూ వీడియో విడుదల చేశారు.
ఇదీ చదవండి