జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలో జరిగిన కాల్పుల్లో... బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన మారుప్రోలు జశ్వంత్ రెడ్డి మరణించారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్రెడ్డి. మరికొద్ది రోజుల్లో జస్వంత్ రెడ్డికి వివాహం చేయాలని భావిస్తున్నలోపే ఉగ్రదాడిలో మరణించాడంటూ... తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జశ్వంత్ రెడ్డి మృతదేహం బాపట్లకు పంపించేందుకి ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జశ్వంత్ రెడ్డి 17 మద్రాస్ రెజ్మెంట్ లో 2016 లో సైనికునిగా చేరారు. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించిన ఆయన... అనంతరం జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు.
- అమరవీరుడికి గవర్నర్, జనసేనాని సంతాపం
వీర జవాన్ జశ్వంత్ రెడ్డి మృతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
- జశ్వంత్ రెడ్డికి మాజీ సైనికుల సంఘం సంతాపం
సరిహద్దుల్లో మరణించిన సైనికుడు జశ్వంత్ రెడ్డికి మాజీ సైనికుల సంఘం సంతాపం తెలిపింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెంలోని జశ్వంత్ రెడ్డి నివాసం వద్ద మాజీ సైనికులు నివాళి అర్పించారు. జశ్వంత్ రెడ్డి మృతదేహం ఇవాళ సాయంత్రానికి స్వగ్రామం చేరుకునే అవకాశం ఉంది. శనివారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దేశ రక్షణ కోసం జశ్వంత్ రెడ్డి మరణించడం మాజీ సైనికులుగా గర్విస్తున్నట్లు వారు తెలిపారు. జశ్వంత్ రెడ్డి మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. జశ్వంత్ రెడ్డి తల్లి వెంకటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోగా వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి