Line Clear For Janasena Varahi Registration: తెలంగాణ రాష్ట్రంలో వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించాలంటూ.. పవన్ కల్యాణ్ ప్రతినిధులు రెండు వారాల క్రితం తమను సంప్రదించారని, వారి దరఖాస్తును పరిశీలించిన అనంతరం మోటార్ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని రవాణాశాఖ ప్రాంతీయ కమిషనర్ పాపారావు తెలిపారు. అది కారవాన్ వాహనమని, కొన్ని సౌకర్యాల కోసం దానిలో మార్పుచేర్పులు చేశామంటూ బాడీ బిల్డింగ్ సంస్థ ధ్రువపత్రాన్ని సమర్పించిందని వివరించారు.
వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని, వాహనానికి అన్ని పరీక్షలు చేసి సంతృప్తి చెందాకే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చామని వెల్లడించారు. ఈ వాహనంలో దేశవ్యాప్తంగా ప్రయాణించవచ్చన్నారు. యుద్ధానికి సిద్ధమంటూ పవన్‌కల్యాణ్ ‘వారాహి’ వాహనం ఫొటో, వీడియోలను ట్విటర్‌లో కొద్దిరోజుల క్రితం పోస్ట్ చేశారు. సైన్యాధికారులు, సైనిక అవసరాలకు వినియోగించే వాహనాలకు మాత్రమే ఆకుపచ్చ రంగు ఉండాలని, ఇతరులు వినియోగించకూడదంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దీనికి రిజిస్ట్రేషన్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది.
‘వారాహి’ని టాటా మోటార్స్ సంస్థ భారత్ స్టాండర్డ్స్-6 ప్రమాణాలతో తయారు చేసింది. ‘వారాహి’ రంగుపై అభ్యంతరం ఏమీ లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. భారత సైన్యం ఉపయోగించే రంగు కోడ్ 7బీ 8165 అని, జనసేన ప్రచార వాహనం రంగు కోడ్ 445సీ44 అని మంత్రి వివరించారు.
ఇవీ చదవండి: